lakshmiparvathi: నా ఫోన్‌ నుంచి తన ఫోన్‌కి ఆ మెసేజ్‌లు పంపింది కోటీనే : కుట్రలో భాగమన్న లక్ష్మీపార్వతి

  • కోటితోపాటు ఇద్దరు పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు భాగస్వాములు
  • కేసు సీఐడీ లేదా సీబీఐకి బదలాయించాలని విన్నపం
  • కేసును రేపు విచారించనున్న హైకోర్టు

ముందస్తు పథకం, కుట్రలో భాగంగానే కోటి తనపై తప్పుడు ఆరోపణలకు తెరతీశాడని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఇందులో భాగంగా నాకు తెలియకుండా నా ఫోన్‌ నుంచి తన ఫోన్‌కి ఆ మెసేజ్‌లు పంపింది కూడా కోటీనే అని ఆరోపించారు. దీనిపై తాను హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని తెలిపారు. నా ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు మా ఇద్దరి సెల్ ఫోన్‌లకు సందేశాలు ఒకే టవర్‌ పరిధి నుంచి వెళ్లినట్లు వారు గుర్తించారని తెలిపారు. 'లక్ష్మీపార్వతి తనకు తల్లిలాంటిది, కానీ ఆమె తనను లైంగికంగా వేధిస్తోంది’ అంటూ కోటి అనే వ్యక్తి సార్వత్రిక ఎన్నికల ముందు చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనమైన విషయం తెలిసిందే. దీనిపై కోటి ఫిర్యాదు మేరకు అప్పట్లో గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై లక్ష్మీపార్వతి హైకోర్టును ఆశ్రయించారు. కోటి తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని, అందువల్ల కేసును సీఐడీ లేదా సీబీఐకి బదిలీ చేయాలని  పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ ఘటన జరిగిన ప్రాంతం హైదరాబాద్‌ పరిధిలోకి వస్తుంది కావున, వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసేందుకు వీల్లేదని వివరించారు. అంతేకాకుండా ఈ ఆరోపణలు వెనుక భారీ కుట్ర దాగుందని, ఈ వ్యవహారంలో కోటితోపాటు అప్పటి డీజీపీ ఠాకూర్‌, ఇంటెలిజెన్స్‌ అదనపు డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, ఇద్దరు మీడియా ప్రతినిధులు ఉన్నారంటూ వారిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రానున్నది.

More Telugu News