VH: ఓటమికి అందరిదీ బాధ్యత, రాహుల్ తప్పుకోవాల్సిన పనిలేదు: వీహెచ్

  • ఇప్పటికే రాజీనామా చేసిన పొన్నం, రేవంత్
  • వారి బాటలోనే వీహెచ్
  • నాయకుడే తప్పుకుంటే తామెలా కొనసాగుతామంటూ వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల్లో దారుణ ఫలితాల అనంతరం ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు రాహుల్ ప్రకటించడంతో కాంగ్రెస్ వర్గాలు తలపట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ వంటి జాతీయపార్టీని నడిపించాలంటూ గాంధీల వారసులే సరైనవాళ్లు అని సొంతపార్టీ నేతలే అభిప్రాయపడుతుంటే, రాహుల్ మాత్రం ససేమిరా అంటున్నారు. దాంతో, రాహుల్ గాంధీనే తప్పుకున్నప్పుడు తమకెందుకు పదవులు అంటూ దేశవ్యాప్తంగా పీసీసీ నేతలు, కార్యదర్శులు కూడా రాజీనామాలు చేస్తున్నారు.

తెలంగాణలో కూడా అదే సీన్ దర్శనమిస్తోంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి తప్పుకోగా, తాజాగా సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. ఓటమికి తామందరిదీ బాధ్యత అయినప్పుడు రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిన అవసరం లేదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కానీ, రాహుల్ పదవిలో లేకుండా తాము పదవుల్లో కొనసాగడం భావ్యం కాదని, అందుకే తప్పుకున్నట్టు వెల్లడించారు. నడిపించాల్సిన నాయకుడే బాధ్యతలు వదిలేస్తే కార్యకర్తల సంగతేంటని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News