Andhra Pradesh: అక్రమ కట్టడాలపై సీఆర్డీఏ నజర్.. నాదెండ్ల వేణు, పాతూరికి నోటీసులు జారీ!

  • కరకట్ట వద్ద రెండు నిర్మాణాలకు నోటీసులు అంటించిన అధికారులు
  • ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
  • లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చేసిన సీఆర్డీఏ అధికారులు తాజాగా కరకట్టపై నిర్మించిన అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీచేస్తున్నారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీచేసిన అధికారులు.. తాజాగా గుంటూరు మాజీ జెడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం గెస్ట్ హౌస్ కు నోటీసులు జారీచేశారు. అలాగే నాదెండ్ల వేణు అనే వ్యక్తికి చెందిన భవనానికి కూడా నోటీసులు ఇచ్చారు.

ఉండవల్లిలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు నోటీసులో తెలిపారు. కృష్ణానదికి ఆనుకుని 100 మీటర్లలోపే ఈ నిర్మాణాలు ఉన్నాయని, నదీ పరిరక్షణ చట్టానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ అక్రమ కట్టడాన్ని ఏడు రోజుల్లోగా కూల్చేయాలనీ, లేదంటే తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్, శైవక్షేత్రానికి కూడా సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీచేశారు. మొత్తం 52 కట్టడాలకు అధికారులు నోటీసులు జారీచేయనున్నారు.

More Telugu News