Andhra Pradesh: ‘ప్రజావేదిక’ కూల్చేశామని అధికారులు చెప్పాకే ఆ రోజు జగన్ నిద్రపోయారట!: వర్ల రామయ్య

  • నవరత్నాలంటూ ఊరించి జగన్ అధికారంలోకి వచ్చారు
  • అందుకు కావాల్సిన నిధులు ఎలా తెస్తారో చెప్పండి
  • అమరావతిలో మీడియాతో ఏపీ టీడీపీ నేత

నవరత్నాలు అని రాష్ట్ర ప్రజలను ఊరించి అధికారంలోకి వచ్చిన జగన్.. వాటిని ఎలా అమలుచేస్తారన్న విషయమై స్పష్టత ఇవ్వలేదని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు.  నవరత్నాలను అమలు చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు కావాలని వ్యాఖ్యానించారు. ఈ మొత్తాన్ని ప్రధాని మోదీ ఇస్తారా? లేక తెలంగాణ సీఎం కేసీఆర్ ఇస్తారా? అని ప్రశ్నించారు.

అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ,
ప్రజావేదికను కూల్చినరోజు అర్ధరాత్రి వరకూ సీఎం జగన్ నిద్రపోలేదని అన్నారు. ‘ఆరోజు అర్ధరాత్రి వరకూ జగన్ నిద్రపోలేదట. ప్రజావేదిక పూర్తిగా కూలిపోయిందనీ, పని అయిపోయిందనీ సీఆర్డీఏ అధికారులు చెప్పాకనే నిద్రపోయారని తెలిసింది. మా అధినేత చంద్రబాబుపై జగన్ కు అంత కక్ష ఎందుకు? ఒకవేళ పగ ఉంటే చంద్రబాబుపైనే తీర్చుకోండి. అంతేకానీ రూ.9 కోట్లతో కట్టిన బంగారంలాంటి బిల్డింగ్ ను కూలగొడితే మీకు ఏం వచ్చింది?

వాడెవడో బావ కళ్లలో ఆనందం చూడాలన్నట్లు ప్రజావేదికను కూలగొడితే మీ కళ్లలో ఆనందం కనబడిందా? నిర్మాణాత్మకంపై కాకుండా విధ్వంసంపై సీఎం జగన్ ఎందుకు దృష్టి పెడతారు? అమ్మఒడి పథకానికి లక్ష కోట్లు కావాలి. బడ్జెట్ లో అంత పెడతారా? ఈ మొత్తాన్ని ఎక్కడ నుంచి తీసుకొస్తారు?’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇన్ని విషయాలపై దృష్టి పెట్టకుండా బిల్డింగ్ కూలగొట్టించారు. దీనివల్ల మీకు ఏమివచ్చింది? కనీసం దాన్ని స్టోర్ గా వాడుకున్నా పోయేది కదా?’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News