Andhra Pradesh: ముస్లింల్లారా.. 70 ఏళ్లుగా మౌనంగా ఉన్నది చాలు.. ఇకనైనా మేల్కొనండి!: అసదుద్దీన్ ఒవైసీ పిలుపు

  • 2017 మూకహత్యలో ప్రాణాలు కోల్పోయిన పెహ్లూఖాన్
  • తాజాగా ఆయన కుటుంబంపైనే కేసు నమోదు
  • తీవ్రంగా స్పందించిన మజ్లిస్ పార్టీ అధినేత

రాజస్థాన్ లోని ఆళ్వార్ లో 2017, ఏప్రిల్ లో ఆవులను సంత నుంచి కొనుక్కుని వస్తున్న పెహ్లూ ఖాన్ పై హిందుత్వ మూకలు దాడిచేశాయి. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ వ్యవహారంలో  పెహ్లూ ఖాన్ కు న్యాయం చేయాల్సిన పోలీసులు ఇంకా మౌనంగానే ఉండిపోయారు. ఈ విషయమై ఖాన్ భార్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు వస్తే తనకు న్యాయం జరుగుతుందని భావించాననీ, అశోక్ గెహ్లాట్ సీఎం అయినా తనకు ఇంకా న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  తాజాగా పెహ్లూఖాన్ కుటుంబంపైనే పోలీసులు కేసు కూడా నమోదుచేశారు.

ఈ విషయమై మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ప్రతిబింబం మాత్రమేనని ఒవైసీ స్పష్టం చేశారు. రాజస్థాన్ లో ఉన్న ముస్లింలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని సమర్థించే వ్యక్తులు సంస్థలను గుర్తించి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ముస్లింలు సొంతంగా తమ రాజకీయ వేదికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. 70 ఏళ్లుగా ముస్లింలు మౌనంగా ఉండిపోయారనీ, ఇది చాలా ఎక్కువ సమయమని అన్నారు.

దయచేసి ఇప్పటికయినా ముస్లింలు మేల్కోవాలనీ, మారాలని కోరారు. ఈ మేరకు ఒవైసీ ట్వీట్ చేశారు. మరోవైపు జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు తీసుకోకుండా ఆవులను తరలించినందుకు పెహ్లూ ఖాన్ కుమారులపై రాజస్థాన్ పోలీసులు తాజాగా కేసు నమోదుచేశారు. దీంతో బాధితులైన తమనే వేధిస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News