Andhra Pradesh: సాక్షి పత్రిక యాజమాన్యానికి మేం ఒక్కటే చెబుతున్నాం!: టీడీపీ నేత వర్ల రామయ్య

  • మా కార్యకర్తలపై ఇప్పటివరకూ 148 దాడులు జరిగాయి
  • హోంమంత్రి తన బాధ్యతలు ఏంటో తెలుసుకోవాలి
  • అమరావతిలో మీడియాతో ఏపీ టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కార్యకర్తలపై ఇప్పటివరకూ 148 దాడులు జరిగాయని ఆ పార్టీ నేత వర్ల రామయ్య తెలిపారు. ఇప్పటికైనా సీఎం జగన్ తమ కార్యకర్తలను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. ఏడుగురు టీడీపీ కార్యకర్తలు హత్యకు గురైనా, తమకు ఓట్లేయలేదని రోడ్డుపై గోడ కట్టినా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీనిపై హోంమంత్రి సుచరిత స్పందిస్తూ.. మీ వాళ్లపై దాడులు జరిగాయి.. మా వాళ్లపై కూడా దాడులు జరిగాయి అని చెబుతున్నారని మండిపడ్డారు. ‘ఇదేంటండీ.. సాక్షాత్తూ హోంమంత్రి ఇవ్వాల్సిన సమాధానం ఇదేనా? మీ బాధ్యతలు ఏంటో ముందు తెలుసుకోండి’ అని హితవు పలికారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు.

నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఇప్పుడు చర్యలు తీసుకోకుంటే 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బజారునపడి రెచ్చిపోతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతారని హెచ్చరించారు. ఏపీని బిహార్ గా మార్చి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కోటంరెడ్డి వాడిన భాషను పత్రికల్లో రాయడానికి విలేకరులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. ‘సాక్షి పత్రిక ఇంకా వైసీపీ ప్రతిపక్షంలోనే ఉన్నట్లు వ్యవహరిస్తోంది. సాక్షి పత్రిక యాజమాన్యానికి మేం గుర్తుచేస్తున్నాం. ఇప్పుడు అధికార పక్షమండి మీరు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా వ్యవహరించడం కరెక్టు కాదు’ అని స్పష్టం చేశారు

More Telugu News