Andhra Pradesh: డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నాం!: టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప

  • జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడింది
  • ఆరుగురు టీడీపీ కార్యకర్తలను చంపేశారు
  • చంద్రబాబు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి
  • కాకినాడలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

35 రోజుల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కుంటుపడిందని ఏపీ మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ శ్రేణులపై ఇప్పటివరకూ వైసీపీ కార్యకర్తలు 8 సార్లు దాడి చేశారని ఆరోపించారు.  ఈ క్రమంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి టీడీపీ ప్రభుత్వం వేసిన శిలాఫలకాలను, పేదలకు అన్నం పెట్టేందుకు ఉద్దేశించిన అన్న క్యాంటీన్లను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చినరాజప్ప మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయని చినరాజప్ప ఆరోపించారు. ఈ విషయమై సోమవారం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయనీ, ఒకవేళ వేటికయినా లేకపోతే క్రమబద్ధీకరించుకోవాలే తప్ప ధ్వంసం చేయకూడదని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి రావాల్సిన నిధులపై సీఎం జగన్ మాట్లాడటం లేదనీ, ఏపీకి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఓ యూనివర్సిటీ లాంటిదనీ, పాత నేతలు పార్టీని వీడినా, కొత్త నాయకత్వం తయారవుతూనే ఉంటుందని తెలిపారు.

More Telugu News