Andhra Pradesh: జగన్.. ఉత్తరాంధ్ర మీకేం అన్యాయం చేసింది?: టీడీపీ నేత దేవినేని ఉమ ఫైర్

  • కృష్ణా డెల్టాకు 263 టీఎంసీల నీళ్లు వచ్చాయి
  • చంద్రబాబు పేరు చెప్పాల్సి వస్తుందనే సీఎం జగన్ మౌనం
  • ఏపీ సీఎంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి

కృష్ణా డెల్టాకు గత 4 సంవత్సరాల్లో 263 టీఎంసీల నీళ్లు వచ్చాయని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. దీనివల్ల కృష్ణా డెల్టా ఆదాయం ఏకంగా రూ.44,000 కోట్లకు చేరుకుందని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ సీఎంతో భేటీ అయిన సీఎం జగన్ ఈ విషయాలను ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. గతేడాది రెండు టీఎంసీల గోదావరి నీటిని ఏలూరుకు ఇచ్చామని, దీనివల్ల రైతులు రెండో పంట పండించుకోగలిగారని చెప్పారు. చంద్రబాబు పేరు చెప్పాల్సి వస్తుందనే ఈ విషయాలను సీఎం జగన్ ప్రస్తావించలేదని విమర్శించారు. విజయవాడలో ఈరోజు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ మాట్లాడారు.

టీడీపీ ప్రభుత్వం గతంలో బహుదా నది నుంచి వంశధారకు అనుసంధాన పనులు చేసిందని దేవినేని ఉమ తెలిపారు. టెండర్లు ఫైనల్ అయినప్పటికీ పనులు ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ఏం అన్యాయం చేసిందనీ, ఎందుకు పనులను ఆపేశారని ప్రశ్నించారు. ‘వంశధార-నాగావళి ఫ్లడ్ బ్యాంకు పనులను ఎందుకు ఆపారు? తోటపల్లి ప్రాజెక్టు ఉత్తరాంధ్ర గుండెకాయ. దీన్ని ఎందుకు ఆపారు? పదేళ్లలో వైఎస్ ప్రభుత్వం, బొత్స, ధర్మాన మంత్రులు చేయలేని పనులను టీడీపీ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తిచేసింది. ఉత్తరాంధ్రకు నీళ్లు ఇవ్వగలిగాం. పంటలను కాపాడగలిగాం. ఈ విషయమై ఎందుకు మాట్లాడలేదు? మీ మౌనానికి కారణం ఏంటి?’ అని దేవినేని ఉమ ప్రశ్నల వర్షం కురిపించారు.

More Telugu News