Telangana: తెలంగాణ కొత్త సచివాలయం వ్యవహారంలో రేవంత్ రెడ్డి పిటిషన్ పై విచారణ వాయిదా

  • సచివాలయం కూల్చొద్దంటూ హైకోర్టును ఆశ్రయించిన రేవంత్
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం
  • జీవన్ రెడ్డి పిటిషన్ ను విచారించలేమన్న హైకోర్టు

తెలంగాణ సచివాలయం కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించాలన్న టీఆర్ఎస్ సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో అన్ని వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లు, ఇతర వివరాలను కూడా తమకు సమర్పించాల్సిందిగా స్పష్టం చేసింది.

అయితే, ఇదే వ్యవహారంలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి 2016లో దాఖలుచేసిన పిటిషన్ పై ఇప్పుడు విచారణ జరపలేమని, దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని హైకోర్టు పేర్కొంది. జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఆగస్టు చివరివారంలో విచారించగలమని తెలిపింది.

సచివాలయం మాత్రమే కాకుండా అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ వ్యవస్థల పాత భవనాల స్థానంలో అన్ని వాస్తు నియమాలతో కూడిన కొత్త భవనాలు నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో రూ.400 కోట్లతో సచివాలయం సరికొత్తగా నిర్మించాలని ముందుకు కదిలారు. దీనిపైనే రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనంటూ ధ్వజమెత్తారు.

More Telugu News