Sri Lanka: టాస్ ఓడినా శ్రీలంక కోరుకున్నదే దక్కింది!

  • వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
  • శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగింత
  • మొదట బ్యాటింగ్ దక్కడంతో సంతోషం వ్యక్తం చేసిన లంక సారథి

వరల్డ్ కప్ లో నేడు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య చెస్టర్ లీ స్ట్రీట్ లో లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనేది మ్యాచ్ లో ఎంతో కీలకం అని చెప్పాలి. మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయడంలో ఒక్కోసారి టాస్ ముఖ్యభూమిక పోషిస్తుంది. సాధారణంగా టాస్ ఓడిన కెప్టెన్లు విచారం వ్యక్తం చేస్తుంటారు. కానీ శ్రీలంక సారథి దిముత్ కరుణరత్నే మాత్రం టాస్ ఓడినా హుషారుగానే కనిపించాడు.

టాస్ అనంతరం టీవీ వ్యాఖ్యాతతో మాట్లాడుతూ, తాము మొదట బ్యాటింగ్ చేయాలనే కోరుకున్నామని, టాస్ ఓడినా తమకు బ్యాటింగే దక్కిందని సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు, సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ పిచ్ సరికొత్తగా, తాజాగా కనిపిస్తోందని, తమ పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపాడు. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో పరువు కోసం ఆడుతోంది. మరోవైపు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పై సంచలన విజయంతో సెమీస్ స్థానంపై ఆశలు పెంచుకుంది. అందుకే ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది.

More Telugu News