Andhra Pradesh: 35 ఏళ్లలో కృష్ణా జిల్లా నుంచి మంత్రులైనవారు మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేదు.. అందుకు కారణం ఇప్పుడు తెలిసింది!: మంత్రి కొడాలి నాని

  • అసలు మంత్రులు ఓడిపోవడం ఏంటి అనుకునేవాడిని
  • సొంత పనులు, నియోజకవర్గ పనులు ఆగిపోతున్నాయి
  • గుడివాడలో మాట్లాడిన ఏపీ పౌరసరఫరాల మంత్రి

వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల ఏపీ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హోదాలో గుడివాడలో పర్యటించిన నాని పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘గత 35 సంవత్సరాల్లో కృష్ణా జిల్లా నుంచి మంత్రిగా పనిచేసినవారు మళ్లీ ఎమ్మెల్యేగా గెలవలేదు. అసలు మంత్రిగా అయితే ఎందుకు ఓడిపోతారు అని అనుకునేవాడిని.

కానీ గత 15-20 రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతుంటే నాకు తెలుస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు సొంత పనులు, నియోజకవర్గ పనులు ఉంటాయి. అయితే, ఏదైనా పనిచేయడానికి నేను బయటకు అడుగుపెడితే చాలు.. పక్క ఊరు , పక్క జిల్లాల నుంచి జనం వచ్చి నన్ను పీక్కు తినేస్తున్నారు. అసలు మన సొంత పనులు పోతున్నాయి. నియోజకవర్గ పనులు పోతున్నాయి’ అని నాని తెలిపారు. ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేత దేవినేని అవినాశ్ పై కొడాలి నాని ఘనవిజయం సాధించారు.

More Telugu News