Jammu And Kashmir: ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసిన భద్రతాబలగాలు

  • భద్రతాదళాల కాన్వాయ్ పై దాడికి కుట్ర
  • ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టిన బలగాలు
  • తప్పించుకున్న వారి కోసం గాలింపు

అత్యాధునిక పేలుడు పదార్థాలతో భారత జవాన్ల కాన్వాయ్ పై దాడి చేయాలనే కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లా కనిపోరా ప్రాంతంలో ఈ ఉదయం ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఈ ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత జమ్ముకశ్మీర్ కు చెందిన ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా కొందరు ఉగ్రవాదుల కదలికలను గమనిస్తున్నామని చెప్పారు. పేలుడు పదార్థాలతో భారత సైన్యం లేదా భద్రతా బలగాల కాన్వాయ్ పై వారు దాడి చేసే అవకాశం ఉన్నట్టు తాము గుర్తించామని తెలిపారు.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఈ ఉదయం తాము కార్డన్ సర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని... ఒక ఇంట్లో ఉగ్రవాదులు దాక్కున్నారని... సెక్యూరిటీ వాహనాల కదలికల గురించి వారి వద్ద సమాచారం ఉందని పోలీసు అధికారి చెప్పారు. భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టు ముట్టగానే ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారని, కాల్పులు ప్రారంభించారని తెలిపారు. భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయాడని... ఆ ఇంట్లో ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారనే విషయంలో స్పష్టత లేదని చెప్పారు. చీకటిగా ఉండటంతో ఉగ్రవాదుల సంఖ్యను సరిగా గుర్తించలేక పోయామని... మరో ఇద్దరు తప్పించుకున్నట్టు భావిస్తున్నామని తెలిపారు.

పుల్వామా దిశగా రోడ్డు మార్గంలో వారు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తప్పించుకున్న టెర్రరిస్టుల కోసం గాలింపును చేపట్టారు. శ్రీనగర్ హైవేకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్లే ఆ ఇంటిని టెర్రరిస్టులు స్థావరంగా చేసుకున్నారని పోలీసులు చెప్పారు.

More Telugu News