Jammu And Kashmir: ‘అమర్ నాథ్’ యాత్రికులపై దాడులకు జైషే ఉగ్రవాదుల కుట్ర.. నిఘావర్గాల హెచ్చరిక

  • జైషే ఉగ్రవాదులు రంగంలోకి దిగారన్న నిఘావర్గాలు
  • భద్రతాబలగాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
  • గతంలో ఉగ్రముప్పుతో ఐదేళ్లు ఆగిపోయిన అమర్ నాథ్ యాత్ర

ప్రముఖ పుణ్యక్షేత్రం అమర్ నాథ్ పై ఉగ్రవాదులు కన్నేశారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. అమర్ నాథ్ కు వెళుతున్న యాత్రికులపై దాడి చేసేందుకు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు తెలిపాయి. ఈ విషయంలో భద్రతాబలగాలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ పర్యటన ముగిసిన మరుసటి రోజే నిఘావర్గాలు ఈ హెచ్చరిక చేయడం గమనార్హం.

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్‌నాథ్‌ యాత్ర మొదలవుతుంది. అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంప్‌ ఇక్కడే ఉంటుంది. పహల్గాం నుంచి అమర్‌నాథ్‌కు 45 కిలోమీటర్లు. బేస్‌క్యాంప్‌ నుంచి బృందాలుగా అమర్‌నాథ్‌ యాత్రకు వెళతారు.

ఏటా జూలై ఆగస్టు నెలల్లో 45 రోజుల్లో పరమశివుడి దర్శనభాగ్యం కలుగుతుంది. సముద్ర మట్టానికి 12,756 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది.  భక్తులకు ఉగ్రముప్పు ఉండటంతో 1991-96 మధ్యకాలంలో అమర్ నాథ్ యాత్రను భారత ప్రభుత్వం నిలిపివేసింది. భక్తులకు ఎలాంటి కీడు తలపెట్టబోమని ఉగ్రవాదులు ప్రకటించడంతో 1996లో తిరిగి అమర్ నాథ్ యాత్ర ప్రారంభమయింది.

More Telugu News