India: ఇన్ని కష్టాల్లో పడిపోతామని అనుకోలేదు: ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్!

  • 8 పాయింట్లతో ఉన్న ఇంగ్లండ్
  • మిగతా 2 మ్యాచ్ లు గెలిస్తేనే సెమీస్ కు
  • ప్రత్యర్థులుగా ఇండియా, న్యూజిలాండ్

ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లు 7. గెలిచింది 4. ఓడింది 3. పాయింట్లు 8. ఇది ఇంగ్లండ్ ప్రస్తుత పరిస్థితి. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు భీకరమైన ఫామ్ లో ఆ జట్టు ఉండగా, టైటిల్ ఫేవరెట్ గా ప్రతి ఒక్కరూ అభివర్ణించారు. అటువంటి ఇంగ్లండ్ జట్టు, ఇప్పుడు సెమీస్ కు వెళ్లాలంటే, తన ముందున్న రెండు మ్యాచ్ లలోనూ కచ్చితంగా గెలవాల్సిందే. ఈ రెండు జట్లూ చిన్నా చితకవేమీ కాదు. అవి ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ ని కూడా చేజార్చుకోని ఇండియా, సెమీస్ స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకున్న న్యూజిలాండ్ లు.

ఆదివారం నాడు ఇండియాతో, ఆపై 3వ తేదీన న్యూజిలాండ్ తో ఇంగ్లండ్ ఆడాల్సివుంది. ప్రస్తుతం ఆ జట్టు ఫామ్ ను చూస్తుంటే, ఈ రెండు మ్యాచ్ లూ గెలవడం అంత సులువేమీ కాదు. ఈ నేపథ్యంలో క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉండే ఎడ్జ్‌ బాస్టన్‌ లో ఆటగాళ్లు ప్రశాంతంగా ఉండాలని ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ సూచించాడు. తాము సెమీస్ కు వెళ్తామన్న నమ్మకం ఉందని, రాబోయే మ్యాచ్ లు తమకు క్వార్టర్ ఫైనల్స్ గా భావిస్తున్నామని తెలిపాడు. గతంలో తమకు ఇటువంటి కఠిన పరిస్థితి రాలేదని, అయితే, ఈ టోర్నీలో తమకు అనుకున్నదాని కంటే ముందుగానే వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు. మిగిలిన మ్యాచ్ లలో ఆటగాళ్లు సత్తా చూపాలని కోరాడు.

More Telugu News