Bonda Uma: టీడీపీని వీడనని చెబుతున్నా ఈ గోలేంటి?: బొండా ఉమ అసంతృప్తి!

  • కాకినాడ సమావేశంలో రగడ
  • అప్పటి నుంచి ఉమ పార్టీని వీడుతారని ప్రచారం
  • పదే పదే ఫోన్లపై చంద్రబాబుకు ఉమ ఫిర్యాదు

తాను పార్టీని వీడబోనని ఎంతగా చెబుతున్నా, కేంద్ర కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు వస్తుండటంతో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల కాకినాడలో కాపు సమావేశంలో జరిగిన పరిణామాల తరువాత ఉమ పార్టీని వీడుతారన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి బుజ్జగించారు కూడా. 1వ తేదీన అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పారు. అయినప్పటికీ, టీడీపీ కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి. కొందరు వ్యక్తులు టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి, ఉమ పార్టీని వదిలేస్తే, ఆ నియోజకవర్గంలో టీడీపీకి అందుకు దీటైన నాయకుడు ఎవరున్నారని ఎంక్వయిరీ చేస్తున్నారు.

 విజయవాడ సెంట్రల్ పరిధిలోని కార్పొరేటర్లకు కూడా ఇదే విధమైన ఫోన్లు వస్తుండటంతో వారు ఈ విషయాన్ని ఉమ దృష్టికి తీసుకెళ్లారు. తాను పరిస్థితినంతా చంద్రబాబుకు వివరించిన తరువాత కూడా పార్టీ ఆఫీస్ నుంచి ఇటువంటి ఫోన్లు వస్తే ఎలాగని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉమ అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు, గురువారం నాడు కూడా ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీలో తన ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా ఉమ ఆరోపించారు. అన్ని విషయాలనూ చర్చించుకుందామని, 1న జరిగే కాపు సమావేశానికి అందరూ హాజరయ్యేటట్టు చూడాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.

More Telugu News