Asha kiran: కి'లేడీ' ఆశాకిరణ్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించిన పోలీసులు

  • పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ఆశాకిరణ్
  • సునాయాసంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదార్లు
  • నైజీరియన్లతోనూ జట్టు

సునాయాసంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతో నైజీరియన్లతో జతకట్టి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న కిలేడీ మాతేటి ఆశాకిరణ్(40)పై రాచకొండ పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. జైలుకు వెళ్లి రావడాన్ని అలవాటుగా మార్చుకున్న ఆశాకిరణ్‌ తీరు మారకపోవడంతో పీడీ యాక్ట్‌ను ప్రయోగించినట్టు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆశాకిరణ్  జేఎన్‌టీయూ నుంచి పీజీ చేసి ఆమెరికాలో గ్రాఫిక్‌ డిజైన్‌ యానిమేషన్‌ రంగాల్లో శిక్షణ పొందింది. పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసింది. అయితే, సునాయాసంగా డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధి ఆమెను కుదురుగా ఉండనీయకుండా చేసింది. డబ్బు సంపాదించడం కోసం అడ్డదార్లు తొక్కింది.

తనకు కోట్లాది రూపాయల విదేశీ నగదు వచ్చిందని, క్లియరెన్స్ కోసం కొంత సొమ్ము చెల్లించాలని చెప్పేది. అంత డబ్బు తన వద్ద లేదని, తనకు కొంత మొత్తాన్ని సర్దుబాటు చేస్తే తనకొచ్చిన దాంట్లో రెండున్నర శాతం వాటా ఇస్తానని నమ్మబలికేది. ఆమె మాటలు నమ్మి, బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసిన పలువురు మోసపోయారు. 2013లో నైజీరియన్లతో జతకట్టి అమాయకులను నమ్మించి రూ.35.75 లక్షలు కాజేసింది. పలుమార్లు పోలీసులకు దొరికిన ఆమె జైలుకు వెళ్లిరావడాన్ని అలవాటుగా మార్చుకుంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న ఆమెపై పీడీయాక్ట్ ప్రయోగించినట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News