Jagan: సీఎం జగన్ తీసుకున్నది చారిత్రక నిర్ణయం: ఆదిమూలపు సురేశ్

  • అమ్మఒడి ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించుకున్నారు
  • అమ్మఒడి విషయంలో అపోహలు వద్దు
  • మరో రెండేళ్లలో స్కూళ్లు, కాలేజీల ముఖచిత్రం మార్చేస్తాం

అమ్మఒడి పథకం విషయంలో సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. మొదట స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి వర్తింపచేయాలని భావించారని, అయితే, పేదరికంలో ఉన్న కాలేజి విద్యార్ధులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే అమ్మఒడి పథకాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపచేయాలంటూ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. తన పాదయాత్ర ద్వారా సీఎం జగన్ విద్యార్థుల కష్టాలను స్వయంగా చూశారని మంత్రి పేర్కొన్నారు.  

అమ్మఒడి పథకం ప్రభుత్వ కళాశాలలకే కాదు ప్రయివేట్ కాలేజీలకు కూడా వర్తిస్తుందని, ఈ పథకం అమలుపై ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేశారు. అమ్మఒడి పథకం ద్వారా పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అమ్మఒడితో సరిపెట్టకుండా స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తమ సర్కారు ఫీజుల నియంత్రణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటుందని, రెండేళ్లలో స్కూళ్లు, కాలేజీల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తామని స్పష్టం చేశారు. విద్యకు పెద్దపీట వేయడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని చెప్పిన మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా, మేనిఫెస్టోలో లేనివాటిని కూడా సీఎం జగన్ అమలు చేస్తున్నారని కొనియాడారు.

More Telugu News