Telugudesam: నేను సుజనా చౌదరితో సన్నిహితంగా ఉంటా.. టీడీపీని మాత్రం వదలను: వల్లభనేని వంశీ

  • ఈ వార్తలన్నీ పూర్తి స్థాయి అపోహలు
  • సుజనా చౌదరితో మాకు బంధుత్వం ఉంది
  • బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం, అవసరం నాకు లేవు 

ఏపీ టీడీపీ నేతలు పలువురు బీజేపీలోకి వెళుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, వల్లభనేని వంశీలు ఆ పార్టీని వీడుతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బీజేపీలో చేరడం లేదంటూ ఇప్పటికే ఈ విషయమై అనగాని సత్యప్రసాద్ స్పష్టత నిచ్చారు. తాజాగా, వల్లభనేని వంశీ కూడా స్పందించారు. ఈ వార్తలన్నీ పూర్తి స్థాయి అపోహలని, గోబెల్స్ ప్రచారం అని అన్నారు. ఇలాంటి వదంతులను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, వాటిని చూసి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేస్తున్నారని అన్నారు.

టీడీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్పించే ప్రయత్నాల్లో సుజనా చౌదరి ఉన్నారన్న వ్యాఖ్యలపై వంశీ బదులిస్తూ, సుజనా చౌదరితో తాను సన్నిహితంగా ఉండటం, తమ మధ్య బంధుత్వం ఉన్న మాట వాస్తవమేనని వల్లభనేనీ వంశీ చెప్పారు. 2009, 2014, 2019 లో సుజనా చౌదరి తనకు వ్యక్తిగతంగా సాయం చేశారని, అయితే, చంద్రబాబు ఆయనకు చెబితేనే తనకు ఆ సాయం లభించిందని అన్నారు. పది రోజుల క్రితం సుజనా చౌదరి టీడీపీని వీడి బీజేపీలో చేరారని, ఆ తర్వాత ఆయన్ని తాను కలవలేదని చెప్పారు. సుజనా చౌదరిని భవిష్యత్ లో కలవొచ్చు గానీ పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం, అలాంటి అవసరం తనకు లేవని వంశీ స్పష్టం చేశారు.

More Telugu News