Narendra Modi: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కొత్త ప్రభుత్వం తొలి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయింది: కాంగ్రెస్ ధ్వజం

  • మోదీ ఏపీ ప్రజలను మోసంచేశారు
  • నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం
  • ప్రత్యేకహోదా సాధించాల్సిన బాధ్యత వైసీపీ సర్కారుపై ఉంది

ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా కొత్త ప్రభుత్వం తొలి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు. ప్రజల నమ్మకాలను వమ్ముచేయడం, రాజ్యాంగ విధానాలను తుంగలో తొక్కడం బీజేపీకి కొత్తకాదని, హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఏపీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా కల్పించడంపై తమ వద్ద ప్రతిపాదనలేవీ లేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం ద్వారా మోదీ ఏపీ ప్రజలను ఎంత మోసం చేశారో అర్థమవుతోందని సూర్జేవాలా పేర్కొన్నారు. ప్రభుత్వం అనేది నిరంతర వ్యవస్థ అని, పార్లమెంటులో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వాలు అమలు చేయాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు.

గత ప్రధానులను ఎలా గౌరవించాలో మోదీ కాంగ్రెస్ కు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఏపీకి ప్రత్యేకహోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చెప్పారని, మరి ఆయన చేసిన వాగ్దానానికి మోదీ ప్రభుత్వం ఎంత విలువ ఇచ్చిందో అందరికీ తెలుసని సూర్జేవాలా ఎద్దేవా చేశారు. ఇప్పుడు, ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రత్యేకహోదా సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.

More Telugu News