Andhra Pradesh: రామసుబ్బారెడ్డీ, జమ్మలమడుగుకు రా.. ఏ సెంటర్ లో అయినా చర్చకు సిద్ధం!: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సవాల్

  • సుధీర్ రెడ్డి బలవంతపు వసూళ్లు చేశారన్న రామసుబ్బారెడ్డి
  • రామసుబ్బారెడ్డి ఆరోపణలను తిప్పికొట్టిన నేత
  • నారప్పస్వామి ఆలయం దగ్గర ప్రమాణం చేద్దామని సవాల్

జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్యే ఎం.సుధీర్ రెడ్డి ఎంఎస్సార్ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లు చేపడుతున్నారని టీడీపీ నేత రామసుబ్బారెడ్డి ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తిప్పికొట్టారు. టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వారానికి ఓరోజు జమ్మలమడుగుకు వస్తారనీ, అలా వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలను కూడా ఆంధ్రజ్యోతి పత్రిక తప్ప వేరే పేపర్లు ప్రచురించవని ఎద్దేవా చేశారు.

తాను ఎమ్మెల్యే అయి నెల రోజులే అయిందనీ, టీడీపీ ఓడిపోవడంతో తన కలెక్షన్ వెళ్లిపోయిందని రామసుబ్బారెడ్డి బాధపడుతున్నారని దుయ్యబట్టారు. మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ స్థానికంగా చేపట్టిన సోలార్ ప్రాజెక్టును ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుమారులు దోచుకుతిన్నారని ఆరోపించారు.

 అవినీతికి పాల్పడ్డారన్న విషయంలో జమ్మలమడుగులో ఏ సెంటర్ లో అయినా చర్చకు సిద్దమనీ, దమ్ముంటే రావాలని సుబ్బారెడ్డికి సవాలు విసిరారు. నారప్పస్వామి దేవాలయం ముందు ప్రమాణం చేద్దామని చెప్పారు. సుబ్బారెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో, ఎవరి దగ్గర ఎంత ముడుపులు పుచ్చుకున్నారో తనకు తెలుసని తెలిపారు.

More Telugu News