Narendra Modi: జార్ఖండ్ లో ముస్లిం యువకుడి మూకహత్య.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ!

  • భారత ప్రజలు నవభారతానికి ఓటేశారు
  • కానీ ఒక్క రాష్ట్రాన్ని దోషిగా నిలబెట్టవచ్చా?
  • రాజ్యసభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ

ఈ సార్వత్రిక ఎన్నికల్లో భారత ప్రజలు నిర్ణయాత్మక, నవభారతానికి ఓటువేశారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఓల్డ్ ఇండియా అనే ఆలోచనను ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో ఈరోజు మాట్లాడారు. ఈ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రంలో తబ్రేజ్ అన్సారీ అనే ముస్లిం యువకుడిని కొందరు దుండగులు కొట్టి చంపడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘అధ్యక్షా.. జార్ఖండ్ లో జరిగిన మూకహత్యలో యువకుడు ప్రాణాలు కోల్పోవడం నిజంగా విచారకరం. ఈ విషయంలో నాతో పాటు ఈ సభలో ఉన్న అందరూ బాధపడుతున్నారు. ఈ ఘటనలో దోషులకు కఠినమైన శిక్షలు పడాలి. కానీ ప్రతిపక్ష నేత ఒకరు(గులాం నబీ ఆజాద్) జార్ఖండ్ ను మూకహత్యల ఫ్యాక్టరీగా అభివర్ణించారు. ఓ రాష్ట్రాన్ని ఇలా దోషిగా నిలబెట్టడం సరైనదేనా? అక్కడా మంచివాళ్లు, సామాన్యులు ఉన్నారు. జార్ఖండ్ మొత్తాన్ని అప్రతిష్టపాలు చేసే హక్కు మనలో ఎవరికీ లేదు’ అని చెప్పారు. భారత్ ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

More Telugu News