Chennai: తాగునీటికి అల్లాడిపోతున్న చెన్నై ప్రజలు.... చలించిపోయిన 'టైటానిక్' హీరో

  • వర్షాలే పరిష్కారం అంటున్న డికాప్రియో
  • సోషల్ మీడియాలో పోస్టు
  • చెన్నైలో నీరులేక హోటళ్లు మూతపడడం పట్ల ఆశ్చర్యం

గత కొన్నాళ్లుగా వర్షాలు లేకపోవడంతో చెన్నై మహానగరాన్ని తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పుడు చెన్నై ప్రజలకు ప్రభుత్వం, ఇతర దాతలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే మంచినీరే దిక్కయింది. ఇంతటి దారుణ పరిస్థితి ఏర్పడడం పట్ల 'టైటానిక్' చిత్ర కథానాయకుడు లియొనార్డో డికాప్రియో చలించిపోయారు. డికాప్రియా హాలీవుడ్ చిత్రాలతోనే కాకుండా మానవీయత ఉన్న పర్యావరణవేత్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

చెన్నై దుస్థితి పట్ల తీవ్రంగా స్పందించిన డికాప్రియో ఎండిపోయిన బావినుంచి పెద్దసంఖ్యలో ప్రజలు నీటిని తోడుకునేందుకు పోటీలుపడుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై ప్రజల మంచినీటి కష్టాలకు వర్షాలు మాత్రమే పరిష్కారం చూపగలవని అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వర్షాలతో మాత్రమే చెన్నై ప్రజలకు ఊరట కలుగుతుందని, చెన్నై వాసులు కూడా వర్షాలు పడాలని కోరుకుంటున్నారని తన పోస్టులో వివరించారు.

కాగా, నీరు లేక చెన్నై మహానగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడడం పట్ల డికాప్రియో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజలకు నీరు అందించేందుకు అధికారులు తీవ్రప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనంలేని పరిస్థితి ఉందని ఈ హాలీవుడ్ హీరో విచారం వ్యక్తం చేశారు.

More Telugu News