Andhra Pradesh: ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి బెదిరింపులు పెరిగిపోయాయి.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు!: పయ్యావుల

  • వేరుశనగ విత్తనాలు రైతులకు అందడంలేదు
  • ప్రభుత్వం ఈ విషయమై దృష్టి సారించాలి
  • అమరావతిలో మీడియాతో ఉరవకొండ ఎమ్మెల్యే

టీడీపీ ప్రభుత్వ హయాంలో వేరుశనగ విత్తనాలు సక్రమంగా అందేవని టీడీపీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇప్పుడు విత్తనాలు సమయానికి అందక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. అనంతపురంలో విత్తన కొరతపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రైతులు విత్తనాల కోసం దళారులను ఆశ్రయించే పరిస్థితి తీసుకురావద్దని కోరారు.

అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఉరవకొండలో వైసీపీ నేతల బెదిరింపులు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నివాసం సమీపంలోని ప్రజావేదిక కూల్చివేత ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే ప్రజావేదికను కూల్చేశారని దుయ్యబట్టారు. నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న అన్ని కట్టడాలను ఇలాగే కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. హంద్రినీవా పనులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాస్తామని పయ్యావుల చెప్పారు.

More Telugu News