Jagan: ఏపీ సీఎం జగన్ ఆస్తులు రూ.510 కోట్లు.. వెల్లడించిన ఏడీఆర్

  • ఏపీ మంత్రివర్గంలో జగనే అత్యంత ధనవంతుడు
  • 26 మంది మంత్రుల్లో 23 మంది కోటీశ్వరులే
  • 17 మందిపై క్రిమినల్ కేసులు

ఏపీ మంత్రి వర్గంలో అత్యంత ధనవంతుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. కేబినెట్‌లోని 26 మంది సమర్పించిన ఎన్నికల ప్రమాణ పత్రాలను పరిశీలించిన అనంతరం ఏడీఆర్ ఓ జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం.. సీఎం జగన్ రూ.510 కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉండగా, రూ.130 కోట్లతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. రూ.61 కోట్లతో మేకపాటి గౌతంరెడ్డి మూడో స్థానంలో ఉన్నారు.

ఇక, జగన్ కేబినెట్‌లోని 26 మంది మంత్రుల్లో 23 మంది అంటే 88 శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మంత్రుల సగటు ఆస్తి రూ.35.25 కోట్లుగా వివరించింది. కేబినెట్‌లోని 17 మంది మంత్రులపై  క్రిమినల్ కేసులు ఉండగా, వీరిలో 9 మందిపై తీవ్రమైన అభియోగాలు నమోదైనట్టు పేర్కొంది. అప్పుల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికంటే ముందున్నారు. ఆయనకు రూ.20 కోట్ల అప్పులున్నాయి.  చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు రూ.12 కోట్లు, ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావుకు రూ.5 కోట్లు ఉన్నట్టు ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది.

More Telugu News