India: 'ఓయ్ సోమ్యా', 'గుజ్జర్ సౌమ్య' పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్ల జోలికిపోవద్దు: భారత జవాన్లకు హెచ్చరిక

  • అమర జవాన్ పవన్ కుమార్ సోదరిగా చెప్పుకుంటున్న గుజ్జర్ సౌమ్య
  • ఆరా తీస్తే నకిలీ ఖాతాగా తేలిన వైనం
  • జవాన్లు అప్రమత్తంగా ఉండాలన్న మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలుంటాయన్న సంగతి తెలిసిందే. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. సైన్యంలో పనిచేసే వ్యక్తుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు శత్రుదేశపు గూఢచారులు సోషల్ మీడియాను సాధనంగా ఎంచుకుంటున్నట్టు కొన్నాళ్లుగా జరుగుతున్న ఘటనలు చెబుతున్నాయి. తాజాగా, 'ఓయ్ సోమ్యా', 'గుజ్జర్ సౌమ్య' అనే పేరుతో మహిళా గూఢచారి భారత సైనికులను టార్గెట్ చేస్తోందని సైనికాధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వర్గాలు భారత జవాన్లను అప్రమత్తం చేశాయి.

ఇన్ స్టాగ్రామ్ లో 'ఓయ్ సోమ్యా', ఫేస్ బుక్ లో 'గుజ్జర్ సౌమ్య' అనే పేర్లతో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వచ్చినా, ఎలాంటి సందేశాలు వచ్చినా స్పందించవద్దని భారత సైన్యం తన సిబ్బందికి హెచ్చరికలు జారీచేసింది. ఆ రెండు పేర్లతో ఉన్న ఖాతాలు అనుమానాస్పదంగా ఉండడంతో, భారత సైనికులను ట్రాప్ చేసేందుకు ఆ ఖాతాలు తెరిచినట్టు సైన్యం నమ్ముతోంది.   అమర జవాన్ పవన్ కుమార్ సోదరినని చెప్పుకుంటూ 'గుజ్జర్ సౌమ్య' జవాన్లకు వల వేస్తోందని, తాను బాంబే ఐఐటీలో చదువుకుంటున్నట్టుగా బదులిస్తోందని సైన్యం పేర్కొంది. దాంతో ఆయా ఖాతాల గురించి లోతుగా పరిశోధించగా అవి నకిలీవని స్పష్టమైందని మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది.

More Telugu News