Jaggaiah Pet: వైఎస్ జగన్ కు కళంకం తెచ్చానంటూ.. పదవికి రాజీనామా చేసిన జగ్గయ్యపేట మునిసిపల్‌ చైర్మన్‌!

  • జగ్గయ్యపేట మునిసిపల్ చైర్మన్ గా ఇంటూరి రాజగోపాల్
  • పోలీస్ స్టేషన్ కు వెళ్లి అధికారులతో గొడవ
  • క్షమించాలని కోరుతూ రాజీనామా సమర్పణ

వైఎస్ జగన్ తనపై ఎంతో నమ్మకం ఉంచి చైర్మన్ పదవిని ఇస్తే, తన చర్యలతో ఆయనకు చెడ్డ పేరు తెచ్చానని అంటూ, జగ్గయ్యపేట మునిసిపల్‌ చైర్మన్‌ ఇంటూరి రాజగోపాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం రాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిరసనకు దిగి, పోలీసులను దుర్భాషలాడినట్టు రాజగోపాల్ పై ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆదివారం నాడు జరుగగా, విషయాన్ని ఆరా తీసిన జగన్, ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దీంతో ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఉదయభానుకు, ఇంటూరి తన రాజీనామా లేఖను అందించారు. ఈ సందర్భంగా తనను క్షమించాలని, సీఎం జగన్ కు తాను కళంకం తెచ్చానని అన్నారు. ఉదయభాను పాదాలకు ఆయన నమస్కరించారు. సీఐ అబ్దుల్ నబీ, ఎస్సై ధర్మరాజు, కానిస్టేబుళ్లతో తాను అనుచితంగా ప్రవర్తించివుంటే క్షమించాలని కోరారు.

కాగా, రౌడీ షీటర్ల ఫొటోలు సేకరించే పనిలో ఉన్న పోలీసులు, రాజగోపాల్‌ కు ఫోన్‌ చేసి ఫొటోలు పంపాలని కోరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై తన అనుచరులతో కలిసి స్టేషన్ కు వెళ్లి, డ్యూటీలో ఉన్న అధికారులతో గొడవపడి, వారిని దుర్భాషలాడినట్టు రాజగోపాల్ పై ఆరోపణలు వచ్చాయి.

More Telugu News