Sachin Tendulkar: సచిన్ ను సన్మానించేందుకు తొమ్మిదేళ్ల ఎదురుచూపులు.... విసిగిపోయిన బీఎంసీ తీవ్ర నిర్ణయం

  • 2010లో 50వ సెంచరీ సాధించిన సచిన్
  • సచిన్ ను సన్మానించాలని ప్రతిపాదించిన కాంగ్రెస్ కార్పొరేటర్
  • సచిన్ రాకపోవడంతో బీఎంసీ వర్గాల్లో చల్లారిన ఉత్సాహం

క్రికెట్ రంగంలో సచిన్ టెండూల్కర్ ఓ ఎవరెస్ట్ శిఖరం. బ్యాటింగ్ లో మాస్టర్ అందుకోని ఘనతలేవు, సాధించని రికార్డులు లేవు! అలాంటి క్రికెటర్ ముంబయిలో పుట్టడం ఆ గడ్డ చేసుకున్న అదృష్టం అని చెబుతుంటారు. అందుకే తమ ముద్దుబిడ్డను సన్మానించుకోవాలని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తలంచింది. ఇది ఇప్పటిమాట కాదు. తొమ్మిదేళ్ల క్రితం సచిన్ తన టెస్ట్ కెరీర్ లో 50వ సెంచరీ సాధించిన వేళ, ఆ బ్యాటింగ్ దిగ్గజాన్ని సన్మానించాలని బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది.

అయితే, సచిన్ అపాయింట్ మెంట్ దొరకడానికి బీఎంసీకి ఏళ్లు పట్టింది. ఆ తర్వాత సచినే అదిగో, ఇదిగో అంటూ తాత్సారం చేయడంతో . ఓసారి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినా సచిన్ హాజరుకాలేదు.  ఆ విధంగా తొమ్మిదేళ్లు గడిచిపోవడంతో మరికొన్నేళ్లు గడచిపోయాయి. దాంతో, ఇంకా సచిన్ వస్తాడని ఎదురుచూడడంలో అర్థంలేదని భావించిన బీఎంసీ సన్మానం ఆలోచనను పూర్తిగా పక్కనపెట్టేసింది.

దీనిపై బీఎంసీ అధికారులు మాట్లాడుతూ, తాము సన్మానించాలని నిర్ణయించుకున్న తర్వాత సచిన్ భారతరత్న, మహారాష్ట్ర భూషణ్ వంటి గొప్ప పురస్కారాలు అందుకున్నాడని, ఇప్పుడు ఓ చిరు సత్కారానికి సచిన్ వస్తాడని ఎదురుచూడడం  వ్యర్థమని భావించి కార్యక్రమాన్ని రద్దుచేస్తున్నామని తెలిపారు.

More Telugu News