Andhra Pradesh: వైఎస్సార్ అడుగుజాడల్లోనే.. ‘రచ్చబండ’ను మళ్లీ ప్రారంభించనున్న సీఎం జగన్!

  • ప్రజావేదికను కూల్చివేస్తామని ప్రకటించిన జగన్
  • కలెక్టర్లు గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆదేశం
  • అధికారులు ఆసుపత్రులు, స్కూళ్లలో నిద్రించాలని సూచన

అమరావతిలోని ప్రజావేదికను కూల్చివేస్తామనీ, ఇది అక్రమ కట్టడమని ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి ఏరకంగా జరిగిందో చూపడానికే ఈ సమావేశం పెట్టానని సీఎం అన్నారు. ఇకపై ప్రతీ సోమవారం కలెక్టర్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించాలని ఆయన తెలిపారు. ‘స్పందన’ పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని సూచించారు. సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుందో తెలపాలనీ, ఇందుకు సంబంధించి రశీదును ఇవ్వాలని చెప్పారు.

తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బాటలోనే ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపడతానని సీఎం జగన్ ప్రకటించారు. ప్రజలకు అందుతున్న సేవలను తాను నేరుగా పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా వారానికి ఏదో ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లలో నిద్ర చేయాలని సీఎం సూచించారు. రైతులు, విద్య, వైద్యం రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జగన్ స్పష్టం చేశారు.

More Telugu News