అప్పట్లో నేను జయచిత్రని పెళ్లి చేసుకోబోతున్నట్టు రాశారు: మురళీమోహన్

24-06-2019 Mon 12:31
  • నాతో జయచిత్ర వరుస సినిమాలు చేశారు
  •  ఆ తమిళ పత్రికకి నోటీసులు పంపించాను 
  • పుకార్లు పట్టించుకోవడం మానేశానన్న మురళీ మోహన్    

నిన్నటి తరం కథానాయకుడిగా మురళీమోహన్ కి మంచి పేరు వుంది. వివాదాలకు ఆయన చాలా దూరంగా వుంటారనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. అలాంటి మురళీ మోహన్ తాజా ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు.

"మొదటి నుంచి కూడా నేను వివాదాలకు దూరంగా ఉండేవాడిని. నా పని నేను చేసుకుని వెళ్లిపోతుంటాను. అప్పట్లో నేను .. జయచిత్ర కలిసి ఎక్కువ సినిమాల్లో నటించాము. దాంతో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఒక తమిళ పత్రిక రాసింది. నేను వాళ్లకి నోటీసులు పంపించడంతో వచ్చి సారీ చెప్పారు. చిత్రపరిశ్రమలో ఇలాంటి రాతలు సహజమనీ, వాటిని సీరియస్ గా తీసుకోవద్దని సన్నిహితులు చెప్పారు. అప్పటి నుంచి పుకార్లను పట్టించుకోవడం మానేశాను" అని చెప్పుకొచ్చారు.