Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను కూడా కూల్చేయనున్న ఏపీ ప్రభుత్వం?

  • నిబంధనలకు విరుద్ధంగా లింగమనేని గెస్ట్ హౌస్
  • 2014 నుంచి అక్కడే ఉంటున్న చంద్రబాబు
  • మరో 22 అక్రమ కట్టడాలపై కూడా కొరడా

అమరావతిలోని ప్రజావేదికను అక్రమంగా, అవినీతి సొమ్ముతో నిర్మించారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కృష్ణా నదీతీరాన అక్రమంగా కట్టిన ఈ కట్టాడాన్ని ఎల్లుండి నుంచి కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణంగా నదీ పరిరక్షణ చట్టం ప్రకారం నదుల తీరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను కూడా ఏపీ ప్రభుత్వం కూల్చివేయవచ్చని తెలుస్తోంది.

2014లో ఏపీ ప్రభుత్వం కరకట్ట సమీపంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టిన 22 మందికి నోటీసులు జారీచేసింది. అయితే వీరంతా రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు కావడంతో అధికారులు ముందుకు వెళ్లలేకపోయారు. ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రే కూల్చివేతలకు ఆదేశించడంతో చంద్రబాబు నివాసంతో పాటు ఈ 22 భవనాలను కూల్చివేయవచ్చని భావిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ వ్యవహారంపై కోర్టులో కేసు నడుస్తోందనీ, దీనివల్ల చంద్రబాబు నివాసాన్ని ఇప్పుడే కూల్చకపోవచ్చని కొందరు ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ భవనాన్ని కూల్చివేయడం ద్వారా ప్రైవేటు అక్రమ కట్టడాలను సహించబోమని సీఎం జగన్ పరోక్షంగా హెచ్చరిక జారీచేశారని చెబుతున్నారు.

More Telugu News