Andhra Pradesh: ఎమ్మెల్యేలు వస్తే కలెక్టర్లు చిరునవ్వుతో రిసీవ్ చేసుకోవాలి.. 2 లక్షల మంది వాళ్లను గెలిపించారు!: సీఎం జగన్

  • మనం పాలకులం కాదు.. సేవకులం అని గుర్తించాలి
  • నవరత్నాల కాపీలు కలెక్టర్లు, కార్యదర్శుల దగ్గరుండాలి
  • ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్

మనం పాలకులం కాదు.. ప్రజా సేవకులం అన్నది ప్రతీక్షణం మనకు గుర్తుండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఎన్నికల్లో తాము నవరత్నాలను అమలు చేస్తామని హామీ ఇచ్చామనీ, ఈ కాపీని ప్రతీ కలెక్టర్, ప్రతీ కార్యదర్శి, ప్రతీ మంత్రి దగ్గర ఉండాలని ఆదేశించారు. ఈ మేనిఫెస్టో అన్నది తమ ప్రభుత్వానికి ఖురాన్, బైబిల్, భగవద్గీత లాంటిదని వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీలు మాత్రం ఎన్నికల ముందు అచ్చేసి, ఎన్నికలు అయ్యాక చెత్తబుట్టలో పారేస్తున్నాయని విమర్శించారు. అమరావతిలోని ప్రజావేదికలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు.

రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చినప్పటికీ, కలెక్టర్లు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే అని చెప్పారు. ప్రజలు తమకు 151 ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులను ఇచ్చారనీ, ఇలాంటి ఘటన ఏపీ చరిత్రలో ఇప్పటివరకూ జరగలేదని తెలిపారు. ప్రజలు తమను నమ్మారు కాబట్టే ఇంత భారీ విజయాన్ని కట్టబెట్టారని వ్యాఖ్యానించారు.

కలెక్టర్ల దగ్గరకు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు చిరునవ్వుతో వాళ్లను రిసీవ్ చేసుకోవాలని జగన్ సూచించారు. ‘2 లక్షల మంది ప్రజలు ఓటేస్తేనే వాళ్లు ఎమ్మెల్యేలు అయ్యారన్నది మనం మర్చిపోకూడదు. వాళ్లను చిరునవ్వుతో రిసీవ్ చేసుకోవాలి’ అని చెప్పారు. ‘రాష్ట్రంలోని నిరుపేదల స్థితిగతులను కలెక్టర్లు మర్చిపోకూడదు. ఏ పథకం అయినా ఈ నిరుపేదల్లోని ప్రతీ అర్హుడికి అందాలి. లేదంటే మాత్రం మనం తప్పుచేసిన వాళ్లం అవుతాం. దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో మనం తప్పుచేసిన వాళ్లం అవుతాం’ అని స్పష్టం చేశారు.

More Telugu News