Tollywood: మీ కాళ్లకు దండం పెట్టి అడుగుతున్నా... మన తెలుగమ్మాయిలకు అన్యాయం చేయొద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్న హేమ

  • మహిళా ఆర్టిస్టులు చాలా కష్టాలు పడుతున్నారు
  • వాళ్లకు అవకాశాలు ఇవ్వండి
  • తెలుగు అమ్మాయిల ఆకలి బాధను గుర్తించండి 

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సర్వసభ్య సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి హాజరైన నటి హేమ ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఇండస్ట్రీలో ఎంతోమంది మహిళా ఆర్టిస్టులు కష్టాలు పడుతున్నారని, అలాంటివాళ్లను ఆదుకోవాల్సిన అవసరం దర్శకనిర్మాతలపై ఉందని స్పష్టం చేశారు.

"ముందు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు తిండి పెట్టండి. ఎక్కడో బయటి నుంచి లేడీ ఆర్టిస్టులను తీసుకువచ్చి తెలుగు ఆర్టిస్టులకు అన్యాయం చేయొద్దు. ఇవాళ ఇండస్ట్రీలో ఆడవాళ్లు చాలా కష్టాలు పడుతున్నారు. వాళ్ల ఆకలి బాధను గుర్తించండి. 'మా'లో 800 మంది సభ్యులుంటే వాళ్లలో ఓ 150 మంది మహిళలు ఉంటారు. కనీసం వాళ్లకు అన్నం పెట్టి కట్టుకోవడానికి బట్టలు కూడా ఇవ్వలేమా? మీ కాళ్లకు దండం పెడతాను సార్, దయచేసి మన తెలుగు మహిళా ఆర్టిస్టులకు అవకాశాలు ఇవ్వండి" అంటూ హేమ కన్నీళ్లు పెట్టుకున్నారు.

More Telugu News