Pakistan: సముద్రం అట్టడుగున నక్కిన పాక్ జలాంతర్గామి.... అన్వేషించి పసిగట్టిన భారత నేవీ!

  • బాలాకోట్ దాడి తర్వాత అదృశ్యమైన పీఎన్ఎస్ సాద్
  • భారీగా గాలింపు చర్యలు చేపట్టిన భారత నావికాదళం
  • పాక్ పశ్చిమ ప్రాంతంలో సాద్ ఆచూకీ లభ్యం

పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు బాలాకోట్ లోని జైషే ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే బాలాకోట్ దాడి తర్వాత పాకిస్థాన్ కు చెందిన పీఎన్ఎస్ సాద్ అనే జలాంతర్గామి అదృశ్యం అయింది. దీనిలో ప్రత్యేకంగా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) పరిజ్ఞానం ఉండడంతో అది సముద్రం అడుగునే రోజుల తరబడి ఉండగలదు.

ఇది గుట్టుచప్పుడు కాకుండా శత్రుదేశాల స్థావరాల్లో చొరబడుతుంది. దీని ప్రత్యేక సామర్థ్యం దృష్ట్యా భారత రక్షణ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. దాంతో, భారత నేవీకి చెందిన భారీ యుద్ధనౌకలు, విమానాలు, జలాంతర్గాములన్నీ సాద్ ఎక్కడుందో తెలుసుకునేందుకు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాయి. సాద్ జలాంతర్గామి నీటి ఉపరితలంపైకి రాకుండానే కేవలం మూడురోజుల్లో గుజరాత్ తీరం చేరగలదు. ఐదు రోజుల్లో ముంబయి తీరంలో ప్రవేశించే సామర్థ్యం ఉంది.

దాన్ని అలాగే వదిలేస్తే పెను ప్రమాదం తప్పదని భావించిన భారత నేవీ సర్వశక్తులను సాద్ అన్వేషణలో మోహరించింది. చివరికి 21 రోజుల తర్వాత సాద్ ఆచూకీ తెలుసుకోగలిగారు. ఆ మాయలమారి జలాంతర్గామి పాక్ పశ్చిమ తీరంలో నక్కినట్టు గుర్తించారు. భారత్ పై యుద్ధం తథ్యమని తేలితే వ్యూహాత్మక దాడుల కోసమే దాన్ని అక్కడ దాచి ఉంచారని భారత రక్షణ శాఖ గ్రహించింది.

More Telugu News