Andhra Pradesh: ఇంత జరుగుతున్నా సీఎం జగన్ స్పందించకపోవడం దారుణం!: టీడీపీ నేత యనమల

  • ఏపీలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు తగదు
  • నెల రోజుల్లో 130కి పైగా దాడులు, దౌర్జన్యాలు
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయి

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులపై వైసీపీ చేస్తున్న దాడులను
తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు ఖండించారు. గుంటూరు జిల్లా నాదెండ్లలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులను ఆయన ప్రస్తావించారు. అమీన్ సాహెబ్ పాలెంలో టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని విమర్శించారు. నరసరావుపేటలో ఎస్సీ వైద్యులపై దాడి జరిగినా చర్యలు లేవని, వారిపై దాడి జరిగినా అట్రాసిటీ కేసు నమోదు చేయలేదని అన్నారు. శ్రీకాకుళం జిల్లా గారలో రహదారిని ధ్వంసం చేశారని, పలుచోట్ల అన్న క్యాంటీన్ల శిలాఫలకాలను పగలగొట్టారని వైపీపీపై ఆరోపించారు.

ప్రకాశం జిల్లా సీఎస్ పురంలో రూ.10 లక్షలతో నిర్మించిన రోడ్డును తవ్వేశారని, అనంతపురం జిల్లా బత్తలపల్లిలో అంగన్ వాడీ భవనాన్ని కూల్చేశారని, తూర్పు గోదావరి జిల్లా పిఠాపుంలో తమ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. కేవలం నెలరోజుల్లో 130కి పైగా దాడులు, దౌర్జన్యాలకు వైసీపీ కార్యకర్తలు పాల్పడ్డారని, భౌతికదాడులు చేస్తూ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇంత జరుగుతున్నా సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమని, ఆయన తన అనుచరులను నియంత్రించకపోవడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. శాంతి భద్రతలు దిగజారితే మొత్తం రాష్ట్రానికే చెడ్డపేరు వస్తుందని, ఇలాంటి ఘటనలు ఆగకుంటే వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోతాయని అన్నారు.

More Telugu News