Hyderabad: ఏకంగా కమిషనర్ నే లిఫ్ట్ అడిగిన చిన్నారి... ఊహించని బహుమతి!

  • జవహర్ నగర్ కమిషనర్ ను లిఫ్ట్ అడిగిన ప్రభు తేజ
  • బాలుడి ఇంటి పరిస్థితి తెలుసుకుని చలించిన కమిషనర్
  • అదే రోజు సైకిల్ బహుమతి

ఆ బాలుడి పేరు ప్రభుతేజ. ఏడో తరగతి చదువుతున్నాడు. రోజూ ఇంటి నుంచి బయలుదేరి మూడు కిలోమీటర్ల దూరంలోని బాలాజీనగర్ ప్రభుత్వ పాఠశాలకు నడుచుకుంటూ వెళుతూ, ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమోనన్న ఆశతో ఎదురు చూసి, ఎవరైనా తన వాహనాన్ని ఎక్కించుకుని తీసుకెళ్తే, వారితో పాటు స్కూల్ కు వెళుతుంటాడు. అతని తల్లి లలిత కిడ్నీ వ్యాధితో బాధపడుతుంటే, తండ్రి చంద్రయ్యకు చూపు సరిగ్గా లేదు. ఓ తమ్ముడు కూడా ఉన్నాడు.

అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ చదువును ఆపకుండా నిత్యమూ లిఫ్ట్ అడుగుతూ, స్కూలుకు వెళ్లే అతనికి ఊహించని బహుమతి లభించింది. రోజు మాదిరిగానే నడుస్తూ వెళ్లిన ప్రభు తేజ, తనకు కనిపించిన ఓ కారును లిఫ్ట్ అడిగాడు. కారు ఆపి ఎక్కించుకున్నది ఎవరో అతనికి తెలియదు. కారు ఎక్కిన తరువాత, కారులోని వ్యక్తి ప్రశ్నిస్తే, తన కుటుంబ పరిస్థితిని వివరించాడు.

ఆ కారులో ప్రయాణిస్తున్నది పరిధిలోని జవహర్ నగర్ మునిసిపల్ ఇన్ చార్జ్ కమిషనర్ రఘు. ప్రభు తేజ చెప్పిన మాటలు విని, అతని కుటుంబ పరిస్థితి గురించి ఆరాతీశాడు. ఉదయం స్కూల్ వద్ద అతన్ని దింపిన రఘు, సాయంత్రానికి అతనికి ఓ కొత్త సైకిల్ ను కొనుగోలు చేసి బహూకరించారు. తల్లికి మునిసిపల్ ఆఫీస్ లో ఏదైనా ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. కుటుంబం బతికేందుకు ఆసరా కల్పిస్తానన్నారు.

ఇక తనకు లభించిన బహుమతిని చూసి ప్రభు తేజ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్వయంగా కమిషనర్ స్కూల్ కు వచ్చి సైకిల్ ను అందించి వెళ్లడంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాను కష్టపడి చదివి సైన్యంలో చేరుతానని, కారు కొంటానని అన్నాడు.

More Telugu News