MS Dhoni: ఆడింది చాలు కానీ.. ఇక దయచెయ్యి: ధోనీపై ఫ్యాన్స్ ఫైర్

  • 52 బంతులాడి 28 పరుగులు చేసిన ధోనీ
  • పేలవ ఆటతీరుపై విమర్శల వెల్లువ
  • మళ్లీ తెరపైకి రిటైర్మెంట్

చావు తప్పి కన్ను లొట్టపోవడం అంటే ఇదేనేమో అని భారత్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ చూసిన అభిమానులు అనుకుంటున్నారు. చివర్లో మహ్మద్ షమీ పుణ్యమా అని చచ్చీచెడి భారత్ గట్టెక్కగలింది. లేదంటే పసికూనల చేతిలో ఓటమి పాలైన అపఖ్యాతిని మూటగట్టుకునేది. ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అందుకు కారణం అతడి బ్యాటింగ్ తీరే. 52 బంతులు ఎదుర్కొన్న ధోనీ కేవలం 28 పరుగులు మాత్రమే చేసి పేలవంగా స్టంపౌట్ అయ్యాడు. వికెట్లు పడిపోయి, పరుగులు రావడం కష్టమైన వేళ క్రీజులో ధోనీ ఉన్నాడని అభిమానులు సర్ది చెప్పుకున్నారు. అయితే, ధోనీ ఆటతీరు చూశాక మరోమారు విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక ‘సారు తప్పుకోవడం మంచిది’ అంటూ రిటైర్మెంట్ వాదనను మరోమారు తెరపైకి తీసుకొచ్చారు.

27వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ధోనీ 45 ఓవర్ వరకు సింగిల్స్ తీస్తూనే ఉన్నాడు. ఏ దశలోనూ భారీ షాట్లకు యత్నించలేదు. దీంతో భారత్ స్కోరు బోర్డు నత్తను తలపించింది. 45వ ఓవర్‌లో రెండు బంతులను డిఫెన్స్ ఆడిన ధోనీ మూడో బంతికి అవుటయ్యాడు. దీంతో ధోనీపై అభిమానులు ఎదురుదాడికి దిగారు. అతడు స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడుతున్నాడని, కీలక సమయంలో చేతులెత్తేస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇక, రిటైర్ కావడమే మంచిదని సూచిస్తున్నారు. ధోనీ ఆడుతున్నంత సేపు తమకు నిద్ర వచ్చిందంటూ సర్ఫరాజ్ ఖాన్ ఆవలింత ఫొటోను ట్వీట్ చేస్తున్నారు.

More Telugu News