Facebook: అమ్మాయిలపై 'ఒకే ఒక్ చాన్స్' వల... కిలేడీ అరెస్ట్!

  • ఫేస్ బుక్ లో ఫేక్ ప్రొఫైల్
  • చాన్స్ ల కోసం ఎదురుచూసేవారే టార్గెట్
  • మరోమారు అరెస్ట్ చేసిన పోలీసులు

జైలుకు వెళ్లి వచ్చినా ఆ కిలాడీ బుద్ధి మారలేదు. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో తప్పుడు ప్రొఫైల్స్ పెట్టి, ఎంతో మంది నుంచి డబ్బులు కాజేసిన ఆమె, సినిమాలు, టీవీ సీరియల్స్ లో ఒక్క అవకాశం ఇప్పిస్తానంటూ ఎంతో మంది నుంచి లక్షల్లో నొక్కేసింది. ఆమే చిత్తూరు జిల్లా చింతపర్తికి చెందిన శ్రీలత అలియాస్‌ శ్రీదేవి అలియాస్‌ సుష్మిత. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీదేవిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు.

మ్యాట్రిమోనియల్ మోసం కేసులో 2017లో జైలుకు వెళ్లి, బెయిల్ పై వచ్చిన శ్రీలత, సైబర్‌ నేరాలకు తెరతీసింది. తాను ఓ ప్రముఖ టీవీ చానల్‌కు ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ గా రూపాంతరం చెందింది. ఫేస్‌ బుక్‌ లో తుమ్మల శ్రీదేవి పేరిట తప్పుడు ఖాతా తెరిచింది. చాన్స్ ల కోసం చూస్తున్న వారిని పరిచయం చేసుకుని వంచించడమే ఆమె పని. ఈ ప్రొఫైల్ గురించి తెలుసుకున్న సదరు టీవీ చానల్, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు ఆధారాలను సేకరించారు. శనివారం శ్రీలతను అరెస్ట్ చేసి విచారించగా, ఇవే తరహా నేరాలను ఆమె ఎన్నో చేసినట్టు తేలింది. శ్రీలతను రిమాండ్ కు పంపనున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News