Krishna: కృష్ణమ్మలో కలవనున్న గోదారమ్మ... జగన్, కేసీఆర్ మాస్టర్ ప్లాన్!

  • కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన జగన్
  • ఆ సమయంలో ఇద్దరి మధ్యా చర్చలు
  • అధికారుల స్థాయిలో చర్చిద్దామని అనుకున్న కేసీఆర్, జగన్

కృష్ణానది, గోదావరి కలిస్తే... అసలు ఆ ఊహే ఎంతో అద్భుతం కదూ. పోలవరం నుంచి పట్టిసీమ ద్వారా రెండు నదులూ కలిసినా, అది కేవలం రెండు జిల్లాలకు మాత్రమే లబ్దిని చేకూర్చింది. అదే గోదావరి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు చేర్చగలిగితే... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ లు తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినులైన ఈ రెండు నదులనూ శ్రీశైలం వద్ద కలపాలని భావిస్తున్నారు. ఈ రెండు నదుల అనుసంధానానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించాలని ఇద్దరూ నిర్ణయించినట్టు తెలుస్తోంది. గోదావరి నీటిని శ్రీశైలం వరకూ తరలించాలన్నదే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రెండు రోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వచ్చిన వేళ, ఇద్దరి మధ్య ఈ చర్చలు సాగినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారుల స్థాయిలో చర్చలు సాగాలని, మరోసారి సమావేశమైనప్పుడు లోతుగా చర్చిద్దామని అనుకున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి నదుల అనుసంధానానం ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దుమ్ముగూడెం - నాగార్జునసాగర్ టెయిల్ పాండే పథకాన్ని చేపట్టినా, తెలంగాణ విడిపోగానే పథకం రద్దయింది. ఇదే సమయంలో ఏపీలో కృష్ణా, పెన్నా నదులను కలిపేందుకు చంద్రబాబు సర్కారు యోచించినా, అవి కార్యరూపం దాల్చలేదన్న సంగతి తెలిసిందే.
కాగా, ప్రస్తుతానికి గోదావరిలో కృష్ణానదికి తరలించేందుకు సరిపడినంత నీరు లేదని అధికారులు అంటున్నారు. రాష్ట్ర అవసరాలకు మించిన నీరుంటే మాత్రం తీసుకెళ్లవచ్చని చెబుతున్న పరిస్థితి. నదుల అనుసంధానంపై మరోమారు కేసీఆర్, జగన్ భేటీ జరిగితేనే మరిన్ని వివరాలు వెల్లడి కావచ్చు.

More Telugu News