Andhra Pradesh: ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు ఆపేస్తాం.. గిరిజనుల మనోభావాలను దెబ్బతీయబోం!: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

  • ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకుంటాం
  • అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలు
  • విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటామని ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. ఎన్నికల హామీ మేరకు విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను లేకుండా చేస్తామని పునరుద్ఘాటించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీయబోమని స్పష్టం చేశారు. ఈరోజు అభిమానులు, మద్దతుదారుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న శ్రీవాణి మీడియాతో మాట్లాడారు.

టీడీపీ అధినేత చంద్రబాబు తరహాలో ఆచరణ సాధ్యం కాని హామీలను సీఎం జగన్ ఇవ్వరని పుష్పశ్రీవాణి చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి ‘రైతు భరోసా’ పథకం అమలు చేస్తామని ప్రకటించారు.‘పేద ప్రజలకు ఇళ్లను కేటాయిస్తాం. కులం, మతం, ప్రాంతం, పార్టీ అన్నతేడా చూపకుండా అందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందజేస్తాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు మంత్రి శ్రీవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News