Andhra Pradesh: శారదా పీఠానికి ఓ న్యాయం.. చంద్రబాబుకు ఇంకో న్యాయమా?: టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్

  • సమాచారం ఇవ్వకుండా వస్తువులు బయటపడేశారు
  • ఈ తరహా కక్షసాధింపు రాజకీయాలు తమిళనాడులోనే ఉండేవి
  • అమరావతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్ లోని ప్రజావేదికలో టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన వస్తువులను బయట పడేయడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్ స్పందిస్తూ.. ప్రజలను కలుసుకోవడం కోసమే చంద్రబాబు ప్రజావేదికను కోరారని తెలిపారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా సామాన్లను బయట పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా కక్షసాధింపు రాజకీయాలను ఇప్పటివరకూ తమిళనాడులోనే చూశామని వ్యాఖ్యానించారు. ప్రజావేదిక వద్దకు ఈరోజు చేరుకున్న రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

ప్రజావేదికలో సామాన్లు బయటపడేయడంపై సీఎం జగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు జరుపుతున్నామని తమకు సమాచారం అందలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఉంటున్న నివాసం అక్రమ కట్టడమనీ, దాన్ని తొలగిస్తామని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చెప్పడంపై స్పందిస్తూ..‘తీసేస్తే తీసుకోమనండి. ఎవరు వద్దన్నారు? అదేమన్నా మేం కొనుక్కున్నామా? మా సొంత ఇల్లా? అద్దెకు ఉంటున్నాం. తీసుకోమనండి’ అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఇంటిని కూల్చేస్తామని చెబుతున్న ఎమ్మెల్యే ఆర్కే ఇదే ప్రాంతంలో నిర్మించిన శారదాపీఠం ఉత్సవాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ తో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. అంటే చంద్రబాబుకు ఓ న్యాయం? శారదా పీఠానికి ఇంకో న్యాయమా? అని నిలదీశారు. ప్రజావేదిక ముందు కూర్చుని ధర్నా చేయాలన్నంత కోపం తనకు వస్తోందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. టీడీపీ నేతలతో చర్చించి తమ తదుపరి కార్యాచరణ చేపడతామని చెప్పారు.  

More Telugu News