Bitcoin: ఆకాశాన్నంటుతున్న బిట్ కాయిన్ విలువ!

  • రూ.7 లక్షలకు చేరిన బిట్ కాయిన్ విలువ
  • 2017 తర్వాత పతనమైన వైనం
  • ఇటీవల కాలంలో బాగా పుంజుకున్న క్రిప్టోకరెన్సీ

వర్చువల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీగా పేరుగాంచిన బిట్ కాయిన్ విలువ ఇప్పుడెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! 2018లో అనేక దేశాల ఆంక్షలతో పతనమైన బిట్ కాయిన్ ధర నమ్మశక్యం కాని రీతిలో పుంజుకుంది. ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ విలువ 10,000 డాలర్లకు సమానం. అంటే, భారత కరెన్సీలో దాని విలువ రూ.7 లక్షలు.

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కూడా 'లిబ్రా' పేరుతో క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలపై అంతర్జాతీయ మార్కెట్లలో నమ్మకం బలపడుతోంది. దాని ఫలితమే చాలారోజుల తర్వాత బిట్ కాయిన్ మరింత బలోపేతం అయింది. బిట్ కాయిన్ ను మొదటిసారి 2008లో ప్రవేశపెట్టగా, 2011 నాటికి ఒక బిట్ కాయిన్ విలువ ఒక డాలర్ గా చలామణీ అయింది. 2017 నాటికి దీని విలువ ఏకంగా 20,000 డాలర్లకు చేరింది.

అయితే, ఇది సురక్షితమైన ద్రవ్యవిధానం కాదని ప్రపంచంలోని అనేక దేశాలు దీనిపై కఠిన ఆంక్షలు విధించాయి. అప్పటినుంచి బిట్ కాయిన్ ట్రేడింగ్ దిగజారింది. గతేడాది డిసెంబర్లో బిట్ కాయిన్ 3,250 డాలర్ల విలువతో సరిపెట్టుకుంది. అయితే, అమెరికా-చైనా మధ్య వాణిజ్యయుద్ధం బిట్ కాయిన్ ట్రేడింగ్ కు ఊపిర్లూదింది. ఇలాంటి సంక్షుభిత సమయంలో బిట్ కాయిన్ లావాదేవీలే శ్రేయస్కరం అని ట్రేడర్లు నమ్మడం బిట్ కాయిన్ కు రెక్కలొచ్చాయి. ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు సైతం బిట్ కాయిన్ ను రికమెండ్ చేస్తుండడం కూడా సానుకూల వాణిజ్యానికి ద్వారాలు తెరిచింది.

More Telugu News