dmdk: సినీ నటుడు విజయకాంత్ కు షాక్.. ఆస్తులు వేలం వేయనున్న బ్యాంకు!

  • రుణాలను సక్రమంగా చెల్లించని విజయకాంత్ 
  • రూ.5.52 కోట్లకు చేరుకున్న అసలు, వడ్డీ
  • వచ్చే నెల 26న వేలంపాట నిర్వహించనున్న ఐవోబీ

తమిళనాడులోని డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ కు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. రుణాలను చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

కాంచీపురం జిల్లా మామండూర్‌లో 4,38,956 చదరపు అడుగుల విస్తీర్ణంలోని శ్రీ ఆండాళ్‌ అళగర్‌ కళాశాల, చెన్నై సాలిగ్రామంలోని 3013 చదరపు అడుగుల నివాసం కోసం విజయకాంత్ ఇండియన్ ఓవర్సీస్  బ్యాంకు నుంచి రుణం పొందారు. ఈ రుణానికి విజయకాంత్ భార్య ప్రేమలత ష్యూరిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో విజయకాంత్ రూ.5.52 కోట్లు అప్పుపడ్డారని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ఈ అప్పును వసూలు చేసేందుకు వచ్చే నెల 26న శ్రీ ఆండాళ్‌ అళగర్‌ కళాశాల, సాలిగ్రామంలోని నివాసాలను వేలం వేయనున్నట్లు పేర్కొన్నాయి. కాగా, తమ అధినాయకుడి ఆస్తుల వేలం విషయం తెలుసుకున్న పలువురు డీఎండీకే కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. గతకొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ ప్రస్తుతం కార్యకర్తలను కలుసుకోవడం లేదు. రాజకీయ కార్యకలాపాలకు సైతం దూరంగానే ఉన్నారు.

More Telugu News