Andhra Pradesh: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీతో మరికాసేపట్లో కేశినేని-గల్లా-రామ్మోహన్ నాయుడు భేటీ!

  • పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో ప్రత్యేకంగా భేటీ
  • టీడీపీ రాజ్యసభ పక్షం విలీనం చెల్లదని లేఖ
  • వెంకయ్య నాయుడిని కూడా కలవనున్న నేతలు

సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ బీజేపీలో చేరడంపై నిరసన తెలియజేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా టీడీపీ లోక్ సభ సభ్యులు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు మరికాసేపట్లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. పార్టీ అధిష్ఠానంతో చర్చించకుండా నలుగురు రాజ్యసభ సభ్యులు విలీనంపై లేఖ ఇవ్వడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తారని సమాచారం.

అలాగే పార్టీ లెటర్ హెడ్ పై నలుగురు రాజ్యసభ సభ్యులు లేఖ ఇవ్వడంపై కూడా అభ్యంతరం చెబుతారని తెలుస్తోంది. ఈ విలీన ప్రక్రియ చెల్లదని ముగ్గురు టీడీపీ లోక్ సభ సభ్యులు వాదించబోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే రాజ్యసభలో బీజేపీలో టీడీపీ విలీనం చెల్లందటూ వీరు చైర్మన్ వెంకయ్య నాయుడికి లేఖ ఇస్తారని పేర్కొన్నాయి. ఇందుకోసం తమకు కొంత సమయం ఇవ్వాలని ఆయనను కోరినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.

More Telugu News