Andhra Pradesh: ఏపీలో సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం సరఫరా చేస్తాం!: మంత్రి కొడాలి నాని

  • ప్రభుత్వం ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది
  • తినేందుకు అనువుగా లేదని రీసైక్లింగ్ కు పంపుతున్నారు
  • సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ఈ భేటీలో మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, శ్రీరంగనాథరాజు, సీఎం సలహాదారు అజయ్ కల్లం, సీఎంవో ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేసే విషయమై చర్చించారు. అనంతరం ఏపీ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని తెలిపారు. ఈ బియ్యం తినడానికి పనికి రావట్లేదని రీసైక్లింగ్ కు పంపుతున్నారని వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న బియ్యంలో 25 శాతం నూక వస్తోందని వెల్లడించారు. ఈ నాణ్యత లేని బియ్యం కారణంగా అన్నం వండాక ముద్దగా మారిపోతుందని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో వినూత్న మార్పులు తీసుకొస్తామని కొడాలి నాని పేర్కొన్నారు. కల్తీలేని తినేందుకు అనువైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉందని అంచనా వేశామన్నారు. ఈ సన్నబియ్యం సేకరణకు ప్రభుత్వంపై రూ.1,000 కోట్ల భారం పడుతుందని చెప్పారు.

More Telugu News