Rahul Gandhi: బీజేపీ ఉచ్చులో పడుతున్నావని ప్రియాంక హెచ్చరించినా... ససేమిరా అంటున్న రాహుల్ గాంధీ!

  • కాంగ్రెస్ అధ్యక్ష పదవి వద్దంటున్న రాహుల్
  • నచ్చజెప్పేందుకు పార్టీ శ్రేణుల ప్రయత్నం
  • కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాహుల్ స్పష్టం

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి తనకు వద్దే వద్దని, ఈ విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని రాహుల్‌ గాంధీ తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన మనసు మార్చేందుకు పలువురు నేతలు ప్రయత్నించి విఫలం కావడంతో, స్వయంగా ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగారు. అయినా ఫలితం లేదని తెలుస్తోంది. సంక్షోభ సమయంలో అస్త్రసన్యాసం చేస్తే నష్టపోవాల్సి వస్తుందని, బీజేపీ ఉచ్చులో పడినట్లవుతుందని ప్రియాంకా గాంధీ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాహుల్ గాంధీ ససేమిరా అన్నట్టు తెలుస్తోంది.

 నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని, ఆ కార్యక్రమంలో తాను భాగం పంచుకోనని కూడా రాహుల్ తేల్చి చెప్పినట్టు సమాచారం. తాను అధ్యక్ష ఎంపికలో ఉంటే పరిస్థితి సంక్లిష్టం అవుతుందని వ్యాఖ్యానించిన రాహుల్, అధ్యక్షుడి ఎంపిక విషయాన్ని పార్టీయే చూసుకోవాలని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటూ, ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కాగా, పార్టీ నూతన అధ్యక్షుడిగా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ను నియమించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపైనా రాహుల్ స్పందించేందుకు నిరాకరించారు. తాను అధ్యక్షుడిని ఎంపిక చేయబోనని, అది పార్టీ చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News