Andhra Pradesh: చంద్రబాబు గిరిజనులను అంటరానివారిగా చూశారు.. అందుకే మంత్రి పదవులు ఇవ్వలేదు!: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

  • వైఎస్సార్ పెళ్లి కానుక కింద రూ.లక్ష ఇస్తాం
  • నేడు మంత్రిగా బాధ్యతల స్వీకరణ
  • గిరిజన హెల్త్ వర్కర్ల జీతం రూ.4వేలకు పెంపు

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు గిరిజనులను అంటరానివారిగా చూశారని ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజనశాఖ మంత్రి పుష్పశ్రీవాణి ఆరోపించారు. అందుకే గిరిజనులకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ పథకం కింద గిరిజన యువతులకు రూ.లక్ష అందిస్తుందని పేర్కొన్నారు. అమరావతిలోని తన ఛాంబర్ లో ఈరోజు పుష్పశ్రీవాణి బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కోలగట్ల, భాగ్యలక్ష్మి, జోగారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజనులకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. గిరిజన గ్రామాల హెల్త్ వర్కర్లకు కనీస వేతనాన్ని రూ.4,000కు పెంచే ఫైల్ పై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖలో పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో విద్యావకాశాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

More Telugu News