Andhra Pradesh: ఏపీలోని మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం: మంత్రి పేర్ని నాని

  • రవాణా, సమాచారశాఖ మంత్రిగా బాధ్యతలు
  • దివ్యాంగులకు మూడేళ్ల ఆర్టీసీ పాసుపై తొలిసంతకం
  • జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం

ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఏర్పాటుచేసిన తన ఛాంబర్ లో బాధ్యతల స్వీకరణ అనంతరం.. దివ్యాంగులు ఓసారి తీసుకుంటే మూడేళ్లు చెల్లుబాటు అయ్యే ఆర్టీసీ పాసులను అందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విషయమై సీఎం జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారని చెప్పారు.

ఏపీలోని మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రానిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని అన్నారు. రవాణాశాఖ ఆఫీసులో కూడా లైసెన్సులకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు.

ఈ నెల 13 నుంచి ఫిట్ నెస్ లేని వాహనాల విషయంలో తనిఖీలు చేపట్టామని మంత్రి చెప్పారు. ఈ దాడుల్లో ఫిట్ నెస్ లేకుండా 624 బస్సులను నడుపుతున్న స్కూలు యాజమాన్యాలపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అలాగే 357 బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారన్నారు. ఈ వివరాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని మంత్రి పేర్ని నాని తెలిపారు.

More Telugu News