gujarat: గుజరాత్ లో దారుణం.. వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త!

  • పుట్టింటికి వెళ్లిపోవాలని అత్తారింట్లో వేధింపులు
  • పోలీసులను ఆశ్రయించిన వివాహిత
  • తక్షణ ట్రిపుల్ తలాక్ ను ఇప్పటికే నేరంగా ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, మత నియమాలకు విరుద్ధమని చెబుతున్నా ట్రిపుల్ తలాక్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విదేశాల్లో పనిచేస్తున్న ఓ యువకుడు తన భార్యకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, అత్తామామలు, భర్తపై కేసు నమోదుచేశారు. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

వల్సాద్ జిల్లాలోని ఉమర్ గాంకు చెందిన సంజన్,జైలూన్ కాలియా భార్యాభర్తలు. కాలియా విదేశాల్లోని షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. కారణమేంటో తెలియదు కాని అత్తమామలు నఫీసా, జావేద్, కుమారుడు కాలియా సంజన్ ను వదిలించుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల సలహా మేరకు కాలియా భార్య సంజన్ కు వాట్సాప్ లో ‘తలాక్.. తలాక్.. తలాక్’ అని పంపాడు. దీనికితోడు పుట్టింటికి వెళ్లిపోవాలని అత్తమామలు వేధించడం ప్రారంభించారు.

దీంతో సహనం కోల్పోయిన సంజన్ పోలీసులను ఆశ్రయించింది. అత్తమామల వేధింపులు, భర్త నిర్వాకంపై ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్రం ఇప్పటికే తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ కింద ఎవరైనా భార్యకు ట్రిపుల్ తలాక్ చెబితే మూడేళ్ల జైలుశిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. అంతేకాకుండా సమస్య పరిష్కారం అయ్యేవరకూ సదరు భార్యకు జీవనభృతి, మైనర్ పిల్లల పోషణకు అయ్యే ఖర్చును భర్తే భరించాల్సి ఉంటుంది.

More Telugu News