Saamana: మహారాష్ట్ర తర్వాతి సీఎం శివసేన నుంచేనన్న ‘సామ్నా’.. ఉద్ధవ్‌ను పెద్దన్నగా పేర్కొన్న సీఎం ఫడ్నవిస్!

  • తమ మధ్య విభేదాలు లేవని నిరూపించే ప్రయత్నం
  • శివసేన వ్యవస్థాపక దినోత్సవానికి ఫడ్నవిస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఉద్ధవ్
  • కలిసే ముందుకెళ్తామన్న సీఎం

మహారాష్ట్రను ఏలే తర్వాతి ముఖ్యమంత్రి శివసేన వ్యక్తే అవుతారంటూ ఆ పార్టీ మౌత్‌పీస్ ‘సామ్నా’ పత్రిక బుధవారం తన ఎడిటోరియల్‌ లో సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే, ఆ తర్వాతి రోజే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేను ‘పెద్దన్న’గా సంబోధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శివసేన వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫడ్నవిస్.. ఉద్ధవ్‌ను పెద్దన్నగా సంబోధించారు. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని కనిపించారు. ఫలితంగా తమ మిత్రత్వం చెడిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని నిరూపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సీట్ల పంపకం, రామాలయ నిర్మాణం వంటి వాటిలో బీజేపీ తీరుపై శివసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రకటనలు చేసింది. అయితే, చివరికి కలిసే ముందుకెళ్లారు. 18 లోక్‌సభ సీట్లతో ఎన్‌డీఏ ప్రభుత్వంలో శివసేన కీలక పాత్ర పోషిస్తోంది. వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతూ.. అడవిలో సింహం-పులి ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు ఏమవుతుందో మనకు తెలుసని అన్నారు. ఏ ఒక్కరో అడవిని పాలించాలని అవి అనుకోవని, కాబట్టి రెండూ కలిసే  పాలిస్తాయని అన్నారు. అలాగే తాము కూడా కలిసే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

More Telugu News