Telangana: హైదరాబాద్ ఇప్పటికీ సేఫ్ కాదు.. వేలాది మంది వీసాలు లేకుండా ఉంటున్నారు!: కె.లక్ష్మణ్ ఆరోపణలు

  • కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ నేత
  • ఉగ్రవాదానికి, మతానికి ముడిపెట్టరాదని వ్యాఖ్య
  • ఒవైసీపై ప్రేముంటే నెత్తిన పెట్టుకోవాలని కేసీఆర్ కు సూచన

తెలంగాణలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కేసీఆర్ పిలవకపోవడం దారుణమని రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఉద్యోగ కల్పన, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆర్టీసీని ఆదుకోవడంపై కేసీఆర్ కేబినెట్ సమావేశంలో కనీసం చర్చించలేదని మండిపడ్డారు. అసలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశమే కేసీఆర్ కు లేదని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు.

హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని గతంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ సమర్థించారు. హైదరాబాద్ ఇప్పటికీ భద్రతాపరంగా సేఫ్ కాదని వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన వీసాలతో ఇంకా వేలాది మంది విదేశీయులు హైదరాబాద్ లో ఉన్నారని ఆరోపించారు. ఉగ్రవాదానికి, మతానికి ముడిపెట్టడం సరికాదన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కేసీఆర్ కు అంతప్రేమ ఉంటే నెత్తిన పెట్టుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను రావొద్దని తాము కోరామని పేర్కొన్నారు.

More Telugu News